హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల ఎవరూ నిరాశ్రయులు కాబోరని, బాధితులందరికీ ప్రభుత్వం తరపున సరైన పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తెలంగాణ శాసన మండలిలో మాట్లాడిన ఆయన, ప్రజలెవరూ రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని సూచించారు. "ఇది ప్రజలకు నేను ఇస్తున్న మాట.. ఎవరికీ నష్టం కలిగించం, బాధితులను మా ప్రభుత్వమే అక్కున చేర్చుకుంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ మరియు దాని శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మరియు ఎలివేటెడ్ కారిడార్లు వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని ఆయన సభకు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనుల కారణంగా సామాన్యులు ఇబ్బంది పడకుండా, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.