హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం వినతి
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2025 5:17 PM IST
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన అయిదు కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి తెలియజేశారు. ఆర్ఆర్ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎం మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.. రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని పీఎంను సీఎం కోరారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని.. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని పీఎంకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.