హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, నగరంలోని రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ (ORR) వెలుపలికి తరలిస్తామని వెల్లడించారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులన్నింటినీ జిల్లాలకు పంపించి, నగరంలో 100% ఎలక్ట్రిక్ (EV) బస్సులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీలపై 'జీరో ట్యాక్స్' అమలు చేయనున్నట్లు, అలాగే వచ్చే ఏడాది నుంచి కాలేజీ విద్యార్థినులకు ఈవీ స్కూటీలు పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్లు సీఎం వివరించారు.
గతంలో చంద్రబాబు, వైఎస్సార్ నగరాభివృద్ధికి చేసిన కృషిని కొనియాడిన ఆయన, భవిష్యత్తులో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, ఎస్‌ఐబీ అధిపతి వంటి కీలక పదవుల్లో మహిళలను నియమించామని, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా మార్చామని గుర్తు చేశారు. అలాగే స్వయం సహాయక బృందాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం, వారు తయారు చేసిన వస్తువులను అమెజాన్ వంటి వేదికల ద్వారా ప్రపంచానికి అందించడం ద్వారా మహిళల ఆర్థిక శక్తిని పెంచుతున్నామని సీఎం వివరించారు.