శ్వేత పత్రం ఎవరినీ కించపరచడానికి కాదు : సీఎం రేవంత్ రెడ్డి
పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2023 7:12 PM ISTపదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేసామన్నారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి.. దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే మా లక్ష్యం అని తెలిపారు. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవని వివరించారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
కొన్ని వాస్తవాలు కఠోరమైనవి.. శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి.. అవమానించడానికి కాదు.. మేం ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదు.. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం అని వివరించారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక అని పేర్కొన్నారు. మీకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోండన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి నేను ఫోన్ చేశానని తెలిపారు. స్వార్ధ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మేం ఆలోచిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు.. మా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు.