ముందుగానే చెప్పాను.. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ : సీఎం రేవంత్

మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రభుత్వం ముందుకెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  22 Dec 2023 3:45 PM GMT
ముందుగానే చెప్పాను.. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ : సీఎం రేవంత్

మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రభుత్వం ముందుకెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. డిసెంబర్ లో మిరాకిల్ జరగబోతుందని నేను ముందుగానే చెప్పాన‌ని గుర్తుచేశారు. ప్రపంచానికే డిసెంబర్ నెల మిరాకిల్ మంత్.. ఎందుకంటే యేసు ప్రభువు జన్మదినం అని పేర్కొన్నారు. సెక్యులర్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని అన్నారు. మొన్న కర్ణాటక.. నిన్న హిమాచల్ ప్రదేశ్.. నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇంతకంటే మరో గురుతర బాధ్యత మీపై ఉంది.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశం రక్షణ ప్రమాదంలో పడిన పరిస్థితి.. మణిపూర్ అల్లర్ల సందర్భంలో ఏం జరిగిందో మనం చూసాం.. కనీసం మణిపూర్ వాసులను ప్రధాని పరామర్శించేందుకు ప్రయత్నించలేదు. మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు.

నిస్సహాయులకు సహాయం అందించండం మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ వేదికగా నేను మీకు మాట ఇస్తున్నా.. తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం.. పేదల అభివృద్ధికి పాటు పడుతుందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతీ పేదకు చేరేలా చూస్తామ‌న్నారు. మేం పాలకులం కాదు.. సేవకులం అని స్ప‌ష్టం చేశారు. ఏసు క్రీస్తు మాకు ఆదర్శం.. బాధ్యతను మరవకుండా పనిచేస్తూ ముందుకెళతామ‌న్నారు. ఏ సమ్మస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి.. సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామ‌ని తెలిపారు.

Next Story