తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా పేరుతో కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాంటి వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులును అలర్ట్ చేశారు. రెండు, మూడేళ్ల కిందటి ఫిర్యాదులు అడ్డుపెట్టుకుని డబ్బులు తీసుకునే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. హైడ్రా కూల్చివేతలపై సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం నిర్వహించారు. కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్‌యంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు ఇటీవల ఉన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.