దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: సీఎం రేవంత్

దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది..అని సీఎం రేవంత్ అన్నారు

By -  Knakam Karthik
Published on : 12 Jan 2026 3:46 PM IST

Telangana, Cm Revanthreddy, Congress Government, Disabled people, financial assistance

దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు..సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్: దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది..అని సీఎం రేవంత్ అన్నారు. విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు కోటాను కేటాయిస్తున్నట్లు ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. కుటుంబసభ్యుల్లా భరోసా కల్పిస్తూ వారికి రూ.50 కోట్లతో ఉపకరణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని దివ్యాంగులకు పిలుపునిచ్చారు.

అంతేకాకుండా క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్‌గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి , వైకల్యం అనే ఆలోచనను రానీకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

ఇక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని సూచిస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది, దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. మరోవైపు వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని సీఎం స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని..సీఎం పేర్కొన్నారు.

Next Story