ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  15 Sep 2023 2:45 PM GMT
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ఆయన లేఖలో కోరారు. 2014లోనే తెలంగాణ అసెంబ్లీ బీసీ రిజర్వేషన్‌కు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాజకీయ అధికారంలో బీసీలను మరింత భాగస్వామ్యం చేయాల్సి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచన చేశారు.

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం పార్లమెంట్ సమావేశాల అజెండాను విడుదల చేసింది. సంవిధాన్ సభ నుంచి మొదలుకొని 75 సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై తొలిరోజున చర్చ చేపట్టనున్నట్లు పేర్కొంది. భారత్ సాధించిన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలు వంటి వాటిపై చర్చ జరగనున్నట్లు తెలిపింది. రాజ్యసభలో మూడు బిల్లులు, లోక్ సభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

Next Story