నిర్మల్ పర్యటనకు సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభ

CM KCR will visit Nirmal district on Sunday. సీఎం కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంను ప్రారంభిస్తారు.

By Medi Samrat  Published on  4 Jun 2023 4:49 AM GMT
నిర్మల్ పర్యటనకు సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభ

సీఎం కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంను ప్రారంభిస్తారు. అలాగే జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో సుమారు 16ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ విధానంలో రూ. 56 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సీఎం కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ కు వెళ్లే దారిపొడవునా భారీ ప్లెక్సీ కటౌట్లు, హోర్డింగ్‌లను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. బందోబస్తు కోసం దాదాపు ఐదువేల మంది పోలీసులు జిల్లాకు చేరుకున్నారు. నలుగురు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 300 మంది సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సాయంత్రం జరిగే బహిరంగ సభలో సుమారు లక్ష మందిని తరలించేలా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు.

ఎల్లపల్లె గ్రామ శివారులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వరుణ్ రెడ్డి, అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్లప‌ల్లి గ్రామ శివారులోని క్రష‌ర్ రోడ్‌లో సభ నిర్వహిస్తున్నామని, గత తొమ్మిదేండ్లుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం ప్రసంగిస్తారని తెలిపారు.


Next Story