రేపు నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ఎన్నికల కారణంగా మంచి సందడి వాతావరణం నెలకొంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు
By Medi Samrat Published on 8 Nov 2023 5:42 PM ISTతెలంగాణ ఎన్నికల కారణంగా మంచి సందడి వాతావరణం నెలకొంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గురువారం నాడు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ కాగా, నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను దేవుడి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ ఆయన ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారు. అర్చకుల ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆలయంలోనే నామినేషన్‌పై సంతకం చేశారు.
నామినేషన్స్ గురించి మంత్రి హరీశ్ మాట్లాడుతూ కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరన్నారు. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.