సీఎం కేసీఆర్ వనపర్తి పర్యటన వాయిదా.. కారణం అదేనా.!
CM KCR wanaparthy district tour postponed. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడింది.
By అంజి
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి కార్యాలయం నుండి ఓ ప్రకటన వెలువడింది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వందవైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులను కలిసేందుకు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. ఈ నెల 23న వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను త్వరలోనే చెబుతామని మంత్రి నిరంజన్ రెడ్డి కార్యాలయం తెలిపింది.
షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్.. కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొత్త మార్కెట్ యార్డు, రెండు పడకల గదుల ఇళ్లు, వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. వనపర్తిలో జిల్లాలో.. టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.