Ambedkar Statue : ఇది విగ్రహం కాదు.. విప్లవం : ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Unveiling The 125 Feet Statue Of Dr BR Ambedkar At Tank Bund. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన
By Medi Samrat Published on 14 April 2023 12:21 PM GMTCM KCR
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ముందుగా జై భీమ్ అని సీఎం నినదించారు. సభికులు కూడా అదే ఉత్సాహంతో జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు.
అంబేద్కర్ విశ్వమానవుడు అని కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనదన్నారు. ఆయన ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితం కాదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆయన ఆశాదీపం. ఆయన చెప్పింది ఆచరించాలి. ఆ దిశగా కార్యాచరణ జరపాలని కేసీఆర్ అన్నారు.
సెక్రటేరియట్‌కు ఆయన పేరు పెట్టుకున్నాం. ప్రతిరోజు సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంబేద్కర్‌ను చూస్తూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతాలు మనసులో మెదలాలని ఈ విధంగా రూపకల్పన చేశాం' అని చెప్పారు. ఇది విగ్రహం కాదని, విప్లవమని సీఎం అభివర్ణించారు. ఇది ఆకారానికి ప్రతీక కాదని, ఇది తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక అని తెలిపారు.
కత్తి పద్మారావు సూచించినట్టుగా అంబేద్కర్ పేరిట ఒక శాశ్వతమైన అవార్డును నెలకొల్పనున్నట్టు కేసీఆర్ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్నవారికి ఉత్తమ సేవలు అందించిన వారికి అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు అందచేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనటువంటి ఆదర్శమూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దినందుకు ఈ అవకాశం తనకు కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బాబా సాహెబ్ బాటలో ఈ దేశాన్ని సరైన దిశలో పెట్టేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామన్నారు. రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు కూడా ప్రవేశపెట్టాం. అదే విధంగా నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. ఈ నెల 30 ప్రారంభించుకుంటున్నాం. ఆకాశమంతా ఎత్తు ఉండేటటువంటి.. ఎక్కడా లేని విధంగా ఈ మహోన్నతమైన విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దళితుల అభివృద్ధి కోసం దళిత మేధావి వర్గం ఆలోచించాలని కేసీఆర్ అన్నారు.
2024 ఎన్నికల్లో రాబోయే రాజ్యం మనదేనని, మహారాష్ట్రలో ఊహించని విధంగా ప్రోత్సాహం, ఆదరణ వస్తున్నదని, యూపీ, బీహార్, బెంగాల్‌తో పాటు ప్రతి చోట మన ప్రభుత్వాలే వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తామని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో 50 వేల మందికి దళిత బంధు సాయం అందింది. ఈ ఆర్థిక ఏడాదిలో లక్ష పాతిక వేల మందికి అందబోతుందని ప్రకటించారు.