మునుగోడు విజ‌యంతోనే దేశం బాగుప‌డుత‌ది : కేసీఆర్

CM KCR Speech In Munugode Meeting. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌

By Medi Samrat  Published on  30 Oct 2022 11:39 AM GMT
మునుగోడు విజ‌యంతోనే దేశం బాగుప‌డుత‌ది : కేసీఆర్

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చిందని.. ప్ర‌జ‌లు ఫ‌లితం ఎప్పుడో తేల్చేశారు.. అది కూడా తెలుసున‌ని కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న స‌భ‌నుద్దేశించి మాట్లాడుతూ.. ఇవాళ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. పార్టీ విడిచిపెట్టి రండ‌ని అడిగారు. అయితే.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టిన‌ట్టు.. మేం అంగట్లో సరుకులం కాదని.. తెలంగాణ బిడ్డలమని.. మ‌న‌ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారని న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొనియాడారు.

పైలెట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు లాంటివారు రాజకీయాలకు కావాలని కేసీఆర్ అన్నారు. జాతి గౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు వీర‌ని అన్నారు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రధాని పదవిని మించిన‌ పదవి లేదు. ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఎందుకు ఈ కిరాతకం. ఎందుకీ అరాచకమ‌ని ప్ర‌ధాని మోదీని కేసీఆర్ స‌భా వేదిక నుంచి ప్ర‌శ్నించారు. 75 ఏళ్ల‌ స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే.. మనం మౌనంగా ఉందామా? అని ప్ర‌జ‌ల‌ను అడిగారు.

మునుగోడులో ఉన్న‌ విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదకి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలని అన్నారు. మునుగోడు ప్ర‌జ‌ల‌కు ఇదో గొప్ప అవ‌కాశం. చరిత్ర‌లో సువ‌ర్ణ అవకాశం ఈ మునుగోడుకే ద‌క్కింది. బీఆర్ఎస్‌కు పునాది రాయి పెట్టే అవ‌కాశం మీకే ద‌క్కింది. సిద్దిపేట ప్ర‌జ‌లు నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. మునుగోడు విజ‌యంతోనే దేశం బాగుప‌డుత‌ది. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండ‌దండ‌గా ఉంటానని అన్నారు. మీరు వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారని.. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు.


Next Story