మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేదొక‌టి.. బండి సంజ‌య్‌కు ఏమీ తెలియ‌దు : సీఎం కేసీఆర్‌

CM KCR Press Meet Highlights. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేది ఒక్క‌ట‌ని తెలంగాణ సీఎం విమ‌ర్శ‌లు

By Medi Samrat  Published on  13 Feb 2022 8:22 PM IST
మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేదొక‌టి.. బండి సంజ‌య్‌కు ఏమీ తెలియ‌దు : సీఎం కేసీఆర్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేది ఒక్క‌ట‌ని తెలంగాణ సీఎం విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తాజాగా జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. అక్క‌డ జ‌రిగిన‌ బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేక‌పోయాం.. అయినా ప్రజలకు కొన్ని వివరాలు తెలియాల‌ని చెప్పాం. నరేంద్ర మోదీ అబద్దాలు చెబుతున్నార‌ని.. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటున్నదని.. అందులో భాగంగానే విద్యుత్‌ సంస్కరణలు తెచ్చార‌ని అన్నారు.

మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా తాను మీటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. విద్యుత్ సెక్టార్‌లో సవరణలు వెనక్కి తీసుకోవాలని గతంలో ప్రధానమంత్రికి లేఖలు రాసినట్లు పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. అసెంబ్లీ తీర్మాణాన్ని కేంద్రానికి పంపినట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారు. పార్లమెంటులో ఆమోదం పొందక ముందే బిల్లును అమలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌కు ఏమీ తెలీదని ఫైర్ అయిన కేసీఆర్‌.. దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని సవాల్ విసిరారు. బండి సంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. జైలు అంటే దొంగలకు భయమని.. తమకేం భయంలేదన్నారు కేసీఆర్‌. మోదీ సర్కార్‌లో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు.

విదేశాల్లో తలదాచుకున్న‌వారిలో ఎక్కువ మంది మోదీకి స్నేహితులేన‌ని.. గుజరాతిలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ నినాదం ఇప్పుడు అవసరమన్నారు. ''కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ, ప్రధాని మోదీ అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉండేదని అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో గెలవకపోయిన అధికారం చేలాయిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.


Next Story