సీఎం కేసీఆర్ రెండో రోజు కూడా ప్రెస్ మీట్.. ఈసారి ఆ అంశాలపై తీవ్ర విమర్శలు
CM KCR Press Meet Highlights. తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు
By అంజి Published on 8 Nov 2021 11:41 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం సాధారణంగా మారిందని ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహి అని.. బిల్లులకు పార్లమెంట్‌లో సహాయం కోరినప్పుడు కేసీఆర్ దేశద్రోహికాడని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపినప్పుడు కేసీఆర్ దేశద్రోహి కాదు..! కానీ, ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహి అవుతారని కేసీఆర్ అన్నారు. బీజేపీ మూడు స్టాంప్‌లను తయారు చేసి పెట్టుకుందని.. ఒకటి దేశద్రోహి, రెండు అర్బన్ నక్సలైట్, మూడు రూరల్ నక్సలైట్ అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు దిగారు. వ్యవసాయ చట్టాలను విమర్శించిన బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా దేశ ద్రోహులా అంటూ నిలదీశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్ ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు. ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో అని విమర్శలు చేశారు.కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. ప్రతి రోజు మాట్లాడుతా. గారడీ చేస్తామంటే నడవనివ్వను. తెలంగాణకు ఏం చేసినావో చెప్పు అంటడు ఈ మొగోడు. తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందుతోంది. నీ ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కదా? అని అన్నారు. గొర్రెల పైసల్లో ఒక్క పైసా కేంద్రానిది ఉందని తేలితే నేను ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద గొర్రెల పథకానికి పైసలు అప్పుగా తీసుకున్నాం. వడ్డీతో సహా తిరిగి కడుతున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడితే పక్క దేశాలకు పోవాలని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
రాయలసీమ కరువు ప్రాంతమని.. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమేనని కేసీఆర్ అన్నారు. కృష్ణానదిలో నీళ్లు లేవని.. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పానన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్‌లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యూహాలు రచిస్తున్నాయని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కృష్ణ, గోదావరి, కావేరీ నదుల అనుసంధానం అంటారని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక ఆ ఊసే ఉండదని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు అందాల్సిన నీరు అందిన తర్వాత అధికంగా ఉన్న నీటిని పక్క రాష్ట్రాలకు పట్టుకెళ్లినా పర్వాలేదని తాను చెప్తే.. ఆ మాటలను కూడా వక్రీకరించారని కేసీఆర్ విమర్శించారు.