సీఎం కేసీఆర్ చెప్పిన జోస్యం ఏమిటంటే.?
సీఎం కేసీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు
By Medi Samrat Published on 20 Oct 2023 8:15 PM ISTసీఎం కేసీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో చెప్పారు. ఎన్నికల్లోబీఆర్ఎస్ కు 95 నుంచి 105 స్థానాలు వస్తాయని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఓ కారణంతోనే తాను ఈసారి కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని, అయితే గజ్వేల్ ను వదిలిపెట్టి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండేలా గజ్వేల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ సెంటిమెంటుగా వస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించి మరో సారి అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి ఆగదని.. మరింత ప్రగతిపథంలో సాగుదామని అన్నారు. గజ్వేల్ ప్రజల మధ్యనే నేను ఉంటాను. మూడో సారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి నెల ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గం కోసం కేటాయిస్తానని నాయకులకు భరోసా ఇచ్చారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల కింద భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ గెలిచిన తర్వాత సీఎం హోదాలో ఇదే కన్వెన్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో సంతృప్తి చెందవద్దని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. గజ్వేల్‌లో ఒక విడత మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి. ఇక్కడ రెండో విడత మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గజ్వేల్‌ను వదిలిపెట్టి వెళ్లేది లేదని.. ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అని అన్నారు.