న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. మోదీకి పది వినతిపత్రాలను అందజేశారు. తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ పై సమీక్ష చేయాలని కోరారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయలని కోరారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరారు.
కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజురు చేయాలని సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కోరారు. అలాగే.. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో సీఎం చర్చించారు. ఇదిలావుంటే.. ఈ నెల 1న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.