జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదని.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టారన్నారు. చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవడో ఇవ్వలేదు మనకు.. పుణ్యానికి ఇచ్చిపోలేదు తెలంగాణనని కేసీఆర్ అన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని కేసీఆర్ అన్నారు.
1956లో మనల్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేశారు. 60 ఏండ్లు గోస పడ్డాం.. సర్వనాశనం అయిపోయామన్నారు. ముంబై బస్సులకు పాలమూరు ఆలవాలమైందన్నారు. తాలుకాలకు తాలుకాలు ఖాలీ అయ్యాయన్నారు. ఆనాడు ఎన్నో బాధలు పడ్డామని కేసీఆర్ తెలిపారు. గోరెటి వెంకన్న ఇదే జిల్లా కవి.. పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే పాలమూరులోనా అని పాటలు రాశారు అని కేసీఆర్ గుర్తు చేశారు. ఆనాడు పిడికిలి ఎత్తి పోరాటం చేస్తే మీరందరూ దీవెన ఇస్తే, అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికివ్వలేదన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ.. 60 సంవత్సరాలు మనల్ని గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.