రైతులను ఆదుకునేందుకు త‌క్ష‌ణ‌మే చర్యలు చేపట్టాలి : సీఎం కేసీఆర్‌

CM KCR issues directions for distribution of rain relief, Gruha Lakshmi funds. అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని

By Medi Samrat  Published on  28 March 2023 3:12 PM GMT
రైతులను ఆదుకునేందుకు త‌క్ష‌ణ‌మే చర్యలు చేపట్టాలి : సీఎం కేసీఆర్‌

CM KCR


అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల సీఎం పర్యటనలు చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని నేటి సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఎఈవో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం తెలిపారు. ఈమేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ను సీఎం ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని సీఎం స్పష్టం చేశారు.

ఖాళీ జాగలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశానికి సంబంధించి సీఎస్ శాంతి కుమారితో ముఖ్యమంత్రి సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి 1 లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా వున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్ధంగా వున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 30న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సీఎం మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణ కోసం సీఎం నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


Next Story