తెలంగాణ బాగుపడుతుంటే అడ్డుపడుతున్నారు : సీఎం కేసీఆర్
CM KCR Fire On Center. తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడారు.
By Medi Samrat Published on 4 Dec 2022 1:03 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడారు. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించడం ఆనందదాయకం అని అన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లను ప్రారంభించుకున్నామని.. సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకున్నామని.. ఎన్నో కలలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ వచ్చాక పాలమూరు వలసలు తగ్గాయన్నారు. సంక్షేమంలో తెలంగాణకు సాటి, పోటీ ఎవరూ లేరని అన్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏడేళ్ల కిందట రూ.60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని.. ఇప్పుడు బడ్జెట్ విలువ రూ.3 లక్షల కోట్లకు తీసుకువచ్చామని అన్నారు.
మనం ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యమని, జీవితానికి అదే పెద్ద పెట్టుబడి, సంతృప్తి అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తీసుకువచ్చినా దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందని.. సంస్కరణ అనేది కొనసాగుతూనే ఉంటుందని వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా మంచి నీటి సమస్యలు, కరెంట్ కోతలున్నాయన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. మేము చేయం.. వాళ్లను చేయనివ్వం అనే విధంగా కేంద్రం తీరు ఉందన్నారు. ఢిల్లీలో అసమర్థ ప్రభుత్వం ఉంది. రాష్ట్రం బాగుపడుతుంటే అడ్డుపడతారా?. ప్రశ్నిస్తే మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. చిల్లరగాళ్ల ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు.