కేంద్రంలోనూ తెలంగాణలా స్పీడ్‌ ఉన్న ప్రభుత్వం రావాలి

CM KCR Fire On Center. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  10 July 2022 2:22 PM GMT
కేంద్రంలోనూ తెలంగాణలా స్పీడ్‌ ఉన్న ప్రభుత్వం రావాలి

సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందని అన్నారు. బీజేపీ వాళ్ల మాటలకు అంతు ఉండాలి. బీజేపీ అసమర్థ విధానాల వల్ల దేశం పరువు పోతోందని.. నుపూర్ శర్మ విషయంగా సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయించడం ఏమిటని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదని.. సీఎంలను, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే దేశం బాగుపడుతుందని.. దేశాన్ని బీజేపీ ఒక జలగలా పట్టి పీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని.. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నారు. నిజానికి గతంలో సాధించిన విజయాలు, చేయబోయే కార్యక్రమాలపై సందేశం ఇవ్వాలి.. కానీ ప్రధాన మంత్రి ఏం మాట్లాడారో దేవుడికే తెలుసు. ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడిగాను.. ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, కేంద్ర మంత్రులు సమాధానం చెప్పలేదు. ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకున్నారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోందో చెప్పాలన్నారు. అప్పట్లో మోదీ అడిగినదాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నామన్నారు. బీజేపీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ డాలర్ తో రూ.80కి పడిపోయిందని అన్నారు.

Advertisement

దేశానికి మోదీ చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదు. తెలంగాణలో తప్ప దేశమంతా తప్పుడు విద్యుత్ పాలసీని తీసుకొచ్చారన్నారు. దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉంది. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం పది శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం మారాలని చెబుతున్నాం.. తప్పకుండా మారుస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలంగాణ సర్కారు ఇంజన్‌ ఫుల్ స్పీడ్‌గా ఉంది. కేంద్రంలోనూ తెలంగాణలా స్పీడ్‌ గా ఉన్న ప్రభుత్వం రావాలన్నారు కేసీఆర్.

Next Story
Share it