మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుంది : సీఎం కేసీఆర్
CM KCR Fire On BJP. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
By Medi Samrat Published on 4 Jun 2023 6:30 PM ISTనిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని, మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని అన్నారు సీఎం కేసీఆర్. మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవని.. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నామన్నారు. ఎస్సారెస్సీ ద్వారా వచ్చే స్కీమ్ 27-28 ప్యాకేజీని త్వరలోనే పూర్తి చేయబోతున్నామని.. ఎస్సారెస్సీ ద్వారా నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు నీరు రాబోతున్నదని అన్నారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామన్నవాళ్లనే బంగాళాఖాతంలో పడేయ్యాలని అన్నారు. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాలని సీఎం ప్రశ్నించారు. ఎవరికి అవకాశం ఇవ్వాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కేసీఆర్ అన్నారు. గిరిజనుల కోసం 196 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. మన హయాంలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని.. ఇందుకు మీరే కారణమని ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు దగ్గరైంది. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 50 ఏళ్లకు కూడా మెడికల్ కాలేజీ వచ్చేది కాదు. పవర్ పర్ క్యాపిటలో నంబర్ వన్ లో ఉన్నాం. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకుని.. రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టిందని అన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. గతంలో తాగు, కరెంట్, సాగునీటి సమస్యలు ఉండేవి. వీటన్నింటిని 9 ఏళ్లల్లో అధిగమించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి భవిష్యత్ కోసం పురోగమించాలని సీఎం కేసీఆర్ అన్నారు.