తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నాం ఢిల్లీ చేరుకున్న సీఎం హస్తినలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, పరిణామాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి, హోంశాఖ మంత్రులను కలిసి కేసీఆర్, నిన్న ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రితో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీతో కీలక విషయాలపై చర్చించారు. విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా ప్రధానితో చర్చించారు. హైదరాబాద్ శివారులో నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీ శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధాని మోదీని కేసీఆర్ ఆహ్వానించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల టూర్ ముగించుకొని కేసీఆర్ ఈరోజు తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు.