తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో వీలైతే పాదయాత్రలు చేయాలని.. వీలైనన్ని ఎక్కువగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
రెండు దపాలుగా రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతల మధ్య ఏమైనా విబేధాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాల గురించి కేసీఆర్ సూచన ప్రాయంగా ఈ సమావేశంలో వివరించారు.