11న సీఎం జగన్ బాపట్ల పర్యటన
CM Jagan Visits For Bapatla District On 11th. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
By Medi Samrat
జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సీఎం సభా ప్రాంగణాన్ని ఉప ముఖ్యమంత్రి మంగళవారం పరిశీలించారు. సభాస్థలి వేదికను ఆయన నిశితంగా పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా పోలీసు కవాతు మైదానంలో హెలీప్యాడ్ ప్రాంతాన్ని, రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హాజరయ్యే సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంతరాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సభా ప్రాంగణం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. సభా ప్రాంగణంలోకి విద్యార్థులు, వీఐపీ లు రావడానికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త జిల్లాగా ఆవిర్భవించిన బాపట్లకు తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నందున విద్యాదీవెన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని ఆయన పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన మూడవ విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 11వ తేదీన బాపట్ల జిల్లాలో ప్రారంభిస్తారని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు విద్యాదీవెన కింద నగదు పంపిణీ జరగనుందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలంతా కలసి జయప్రదం చేయాలన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఆయన వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలలో అసౌకర్యాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సభా ప్రాంగణానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు. నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తారని.. దీంతో బాపట్ల మరింత అభివృద్ధి చెందనుందని ఆయన తెలిపారు.