తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై నేడు క్లారిటీ?
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇవాళ డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.
By అంజి Published on 6 Dec 2023 4:03 AM GMTతెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై నేడు క్లారిటీ?
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇవాళ డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. సామాజిక కోణంలో కేబినెట్ కూర్పుకు కసరత్తు చేస్తుండగా.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకు, మరొకరికి అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీతక్కలకు కీలక శాఖలు అప్పగించనున్నట్టు సమాచారం. ఓసీలకు ఐదు, బీసీలకు మూడు, ఎస్సీ, ఎస్టీలకు 4, ఇద్దరు మహిళా మంత్రుల పేర్లను రేవంత్‌తో కలిసి ఫైనల్ చేయనుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంత్రి పదవులపై చర్చ జరుగుతోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహనరావుకు మంత్రి మండలిలో ఛాన్స్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు వివిధ నగరాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉండటంతో ఆ శాఖ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని సమాచారం. అలాగే మదన్‌కు జాతీయ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని బయట టాక్ నడుస్తోంది.
మరో వైపు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆయన ఆహ్వానించనున్నారు. అనంతరం కేబినెట్ కూర్పుపైనా వారితో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.