హ‌నుమ‌కొండలో 10 కోర్టుల భ‌వ‌న స‌ముదాయం.. ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana participating inauguration of court building complex at hanamkonda. వరంగల్‌ జిల్లాలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice NV Ramana) పర్యటన కొనసాగుతున్నది. ఆదివారం నాడు హనుమకొండ జిల్లా

By అంజి  Published on  19 Dec 2021 12:56 PM IST
హ‌నుమ‌కొండలో 10 కోర్టుల భ‌వ‌న స‌ముదాయం.. ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ

వరంగల్‌ జిల్లాలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice NV Ramana) పర్యటన కొనసాగుతున్నది. ఆదివారం నాడు హనుమకొండ జిల్లా కేంద్రంలో.. 10 కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఆధునిక సదుపాయాలతో 10 కోర్టుల సముదాయాన్ని నిర్మించారు. కాగా కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మతో కలిసి సీజేఐ ఎన్వీ రమణ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ‌మూర్తులు ఉజ్జ‌ల్ బుయాన్, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌స్టిస్ న‌వీన్ రావు, వ‌రంగల్ జిల్లా జ‌డ్జి ప్రిన్సిప‌ల్ జ‌డ్జి నందికొండ న‌ర్సింగ‌రావు, ప‌లువురు న్యాయ‌వాదులు, సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్‌ సివిల్‌ కోర్టును పోక్సో కోర్టుగా మార్చారు. అలాగే లైంగిక దాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనబడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోర్టుకు వచ్చే చిన్నారులు, తల్లిదండ్రులు, కక్షిదారులు కనబడకుండా ఉండేందుకు స్పెషల్‌ గేట్‌ ఏర్పాటు చేశారు. కాగా కోర్టు విచారణ కోసం ప్రత్యేక గదులను అందుబాటులోకి తెచ్చారు. కోర్టు ప్రవేశ మార్గం దగ్గర కాకతీయ కళాతోరణం, మార్గంలో పూల మొక్కలు ఏర్పాటు చేశారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ఆదివారం ఉదయం వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Next Story