కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

ఇండియా చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగినపుడు ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని.. దేశాన్ని గెలిపించిన శక్తి.. మహిళా శక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat
Published on : 17 May 2025 5:56 PM IST

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

ఇండియా చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగినపుడు ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని.. దేశాన్ని గెలిపించిన శక్తి.. మహిళా శక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వియ్ హ‌బ్‌ విమెన్​ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదన్నారు. దేశానికి మహిళలు ఆదర్శం.. మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు సోనియమ్మ నజరానా అందించారన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించాం.. విద్యార్థుల యునిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించామ‌న్నారు.

వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాం.. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నాం.. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ ను కేటాయించాం.. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని మేం నమ్ముతున్నామ‌న్నారు.

స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని కోరుతున్నా.. మీ రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తాన్నారు. దేశంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారు.. కానీ ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారు.. ఆర్ధిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతం అని కొనియాడారు. ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించాం.. మీరు సమర్ధవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నాం.. మా ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానం అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Next Story