తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు చెందిన పూర్తి వివరాలను అందించాలని కోరారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలాంటివని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయా నేతలు తమ తమ నియోజకవర్గంలో అందజేశారు.