కేసీఆర్ పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2024 1:28 PM GMTటీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అందిన కాడికి దోచుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేశారని ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మిగిల్చిందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని, మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోపిడి పాలన కారణంగా, పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు సీఎం రేవంత్. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. 1981 ఇంద్రవెల్లి దారుణంపై ఆనాడే క్షమాపణ చెప్పానని, ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో ఆ తప్పు జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని అన్నారు.
జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేశారని, ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామన్నారు. ఇంద్రవెల్లి గాలి, నీటిలో పౌరుషం ఉందని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదని, తాము 2 నెలల్లో ఎలా చేస్తాంమని ప్రశ్నించారు.