రాష్ట్రంలో స్మార్ట్ పోల్స్, భూగర్భ విద్యుత్ లైన్లు..విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం

జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 16 May 2025 3:09 PM IST

Telangana, Cm Revanthreddy, Power Department, Congress Government

రాష్ట్రంలో స్మార్ట్ పోల్స్, భూగర్భ విద్యుత్ లైన్లు..విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం

తెలంగాణలో వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పరిస్థితిపై సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.

ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 'గత ఏడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది. 2025- 26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుంది. 2034-35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుంది. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం' అని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు

ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. "వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి" అని సీఎం రేవంత్ అధికారులతో పేర్కొన్నారు.

"భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతుంది. హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి" అని సీఎం రేవంత్ ఆదేశించారు.

Next Story