వరి సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది

Centre playing with lives of farmers. మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉన్నందున రైతులతో మమేకమై ఎక్కువ ఎకరాల్లో

By Medi Samrat  Published on  18 April 2022 2:56 PM IST
వరి సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది

మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉన్నందున రైతులతో మమేకమై ఎక్కువ ఎకరాల్లో పత్తి, సోయాబీన్‌ సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన వరి సేకరణ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులను ఎక్కువ ఎకరాల్లో, సోయాబీన్‌ సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వానాకాలం సీజన్‌కు ముందే రైతులకు ఎరువులు అందజేయాలని, అనంతరం విత్తనాల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డీజిల్, ఎరువుల ధరలు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాగు పెట్టుబడిని పెంచిందని మంత్రి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోందని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందున యాసంగిలో తెలంగాణ దేశంలోనే అత్యధికంగా వరిసాగు చేసిందని అన్నారు. వరి సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఆరోపించారు.

పంజాబ్ రైతుల‌ నుండి 100 శాతం వరి, గోధుమ పంటను కొనుగోలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణ నుండి యాసంగి వరిని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు వెచ్చించి వరిధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌ల గోడౌన్‌ అద్దెలు, వడ్డీలు కేంద్రం చెల్లించకపోవడంతో ఇప్పటికే వరి సేకరణకు రూ.4,500 కోట్లు ఖర్చు చేశామన్నారు.

యాసంగి వరి కొనుగోళ్లపై మంత్రి స్పందిస్తూ.. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి వరి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తారన్నారు. ఈ యాసంగిలో రైతులు వరి నాట్లు కాస్త ఆలస్యంగా వేసినందున, కోతలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, వానాకాలం వచ్చే వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. వర్షాభావంతో వరిపంటను కాపాడేందుకు మరిన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ధాన్యం సరిగా ఎండిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని మంత్రి రైతులకు పిలుపునిచ్చారు.
















Next Story