మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik
మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70 శాతం హైద్రాబాద్ నుంచి వస్తుంది. కానీ హైద్రాబాద్ అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు ఎన్ని? జీహెచ్ఎంసి జనరల్ బాడీ సమావేశం తూతూ మంత్రంగ నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని విమర్శించడం కాదు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. మంత్రులు మాపై విమర్శలు మానుకొని ప్రజల సమస్యలపై చూపండి. హైదరాబాద్ సమస్యలపై సెక్రటేరియట్ వద్ద నిరసనకు పిలిపిస్తే మా నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ లో భూముల అక్రమ వ్యాపారం హోల్ సేల్ గా సాగుతుంది. గతంలో కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా భూములు అమ్మితే నేడు హోల్ సేల్ వ్యాపారం సాగుతుంది..అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు. పీఆర్సీ 6 నెలల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పారు. నేటికి అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో 3 డిఏ లు పెండింగ్‌లో, రేవంత్ హయాంలో ఇప్పటికే 3 డీఏ లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏలు మేము అధికారంలోకి వచ్చాకే క్లియర్ అయ్యేలా ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగులు వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల కోసం ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. సెప్టెంబరు 1 నుంచి ఉద్యోగ సంఘాలు చేయనున్న ఆందోళనకి బీజేపీ మద్దతు ఇస్తుంది. ఎరువులు కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రానికి ఎవరు ఇస్తున్నారు. కేంద్రం ఎరువుల బస్తాపై 2400 నుంచి 2600 సబ్సిడీ ఇస్తుంది. రూ.266 అమ్మాల్సిన బస్తా రూ 400 ఎలా అమ్ముతున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్లో ఎవరు అమ్ముతున్నారు. వారిపై ఏం చర్యలు తీసుకున్నారు సీఎం సమాధానం చెప్పాలి. ఎరువుల కృత్రిమ కొరత లేకుండా చూడాలి. ఒక్క బస్తా యూరియా పక్క దారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి..అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.