ఆ విషయంలో ఆయనవి బోగస్ మాటలు, రేవంత్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని అధికార పక్షం చేసిన కామెంట్స్‌పై కిషన్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 8 March 2025 5:30 PM IST
ఆ విషయంలో ఆయనవి బోగస్ మాటలు, రేవంత్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని అధికార పక్షం చేసిన కామెంట్స్‌పై కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ కంటే మాకే ఎక్కువ పట్టింపు ఉందని ఉందన్నారు. శనివారం నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలు అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏం మాట్లాడారో చూడాలన్నారు. హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని మేము దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఎన్నికలకు ముందు సోనియా గాంధీ సంతకాలతో ఇచ్చిన గ్యారెంటీలకు ఇప్పటి వరకు అతీగతీ లేదు కానీ మేము చెప్పని ప్రాజెక్టులు మమ్మల్నీ చేయాలంటే దానికి మేమెలా బాధ్యులం అవుతామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ఏ ప్రాతిపదికన గ్యారెంటీలు ఇచ్చారో వాటిని పూర్తిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ ప్రారంభం కాబోతుంటే ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారు. కనీసం అక్కడికి వెళ్లి చూసి రావాలి. కావాలంటే కాంగ్రెస్ మంత్రులకు వందేభారత్ ట్రైన్ లో నేనే తీసుకెళ్లి జరుగుతున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు చూయిస్తానన్నారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశంలో గానీ, తెలంగాణలో గానీ ఒక్క ఎంపీ సీటు తగ్గదన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీనే లోక్ సభలో స్పష్టంగా చెప్పారన్నారు. స్టాలిన్, రేవంత్ రెడ్డివి అన్ని బోగస్ మాటలన్నారు. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయని అందువల్ల చెప్పుకోవడానికి ఏమీ లేక మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తిని హిందీ నేర్చుకోవాలని బలవంతం చేశామా అని ప్రశ్నించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత ఇచ్చింది మోడీ ప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు అని..కిషన్ రెడ్డి అన్నారు.