తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరి అవలంబిస్తుందని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. ఆయన ఇలా రాసుకొచ్చారు.. తెలంగాణ సెమీ కండక్టర్లకు అనుకూలం. ప్రపంచ స్థాయి అధునాతన వ్యవస్థకు, ప్యాకేజింగ్ సౌకర్యం అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్సిడీలతో క్లియరెన్స్ ఇచ్చి 10 ఎకరాలు భూమి మహేశ్వరంలో కేటాయించింది. కంపెనీలు పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. పక్షపాత ధోరణితో కేంద్రం వ్యవహరించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలంగాణను విస్మరించింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ఒక్క ఎకర భూమి కూడా సెమీ కండక్టర్‌కి కేటాయించలేదు. కేంద్రం ఇలాంటి చర్యల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రాజకీయంగా ప్రేరేపించిన ఇలాంటి నిర్ణయాలు తెలంగాణకు అవమానమే అని.. మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.