హెల్త్ అలర్ట్: హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌లో డెంగ్యూ, చికున్‌గున్యా ముప్పు
హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sept 2024 10:50 AM ISTహైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) ఈ ప్రాంతాలలో డెంగ్యూ, చికున్‌గున్యా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ఈ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడటానికి నిలిచిపోయిన నీటిని తొలగించడం, సకాలంలో వైద్య సంరక్షణ వంటి చర్యలను పాటించాలని ప్రజలను కోరింది.
డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నాయి
TSHA ప్రధాన కార్యదర్శి ఆర్ గోవింద్ హరి మాట్లాడుతూ "ఈ సీజన్‌లో డెంగ్యూ ప్రభావాన్ని అంచనా వేయడం ఇప్పుడే కరెక్ట్ కాదు. అలా చేస్తే తొందరపడినట్లు అవుతుంది. అయితే మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము." అని తెలిపారు. డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ, చికున్‌గున్యా అనేక జిల్లాల్లో డెంగ్యూ కంటే ఎక్కువగా ఉందని, ఫ్లూ ఎ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వి), ఎంటెరిక్ ఫీవర్ వంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా గణనీయమైన సంఖ్యలో పెరుగుతున్నాయని ఆయన వివరించారు.
స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన డేటా ప్రకారం డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టు 23 న 4,459 నుండి ఆగస్టు 30 నాటికి 6,242కి పెరిగింది. తక్కువ సమయంలోనే ఎక్కువగా ఈ కేసులు పెరిగాయి. హైదరాబాదు, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మంలలో తీవ్రత ఎక్కువగా ఉంది.
చికున్‌గున్యాను డెంగ్యూగా తప్పుగా నిర్ధారణ చేయడం:
హైదరాబాద్‌లోని వైద్యులు చికున్‌గున్యాను డెంగ్యూగా తప్పుగా నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే రెండు వ్యాధుల లక్షణాల్లో అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటివి ఉంటాయి. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రణీత రావు మాట్లాడుతూ, “మేము ఎదుర్కొంటున్న సవాళ్ళలో మొదటి కొన్ని రోజుల్లో చికున్‌గున్యా, డెంగ్యూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కాబట్టి రెండు వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించడం. సరైన రోగనిర్ధారణ పరీక్షలు లేకుండా, రోగులు తమకు డెంగ్యూ ఉందని భావిస్తూ ఉంటారు. ఇది అనవసరమైన ఆందోళనకు దారితీస్తుంది. చాలా మంది రోగులు చికున్‌గున్యాకు చికిత్సను ఆలస్యం చేయడమే కాకుండా, ఎవరికి వారు సొంతంగా మందులను తీసుకోడానికి చేసే ప్రయత్నించడం వల్ల ఈ సమస్య మరింత జటిలమైంది." అని వివరించారు.
పిల్లలు, ఇతర జనాభాపై ప్రభావం:
హైదరాబాద్‌లో ముఖ్యంగా చిన్నారుల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని ఆసుపత్రుల నివేదికల ప్రకారం, దాదాపు 20 శాతం మంది రోగులు పిల్లలే ఉన్నారు. వీరికి సంరక్షణ అవసరం. మిగిలిన 80 శాతం మంది ప్రాథమిక చికిత్సతో ఇంట్లోనే కోలుకుంటున్నారు.
సికింద్రాబాద్‌లోని ఒక ఆసుపత్రికి చెందిన శిశువైద్యుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “పిల్లలు డెంగ్యూ, చికున్‌గున్యా రెండింటి బారిన పడే ప్రమాదం ఉంది, ముఖ్యంగా డీహైడ్రేషన్, తీవ్రమైన దద్దుర్లు లేదా ప్లేట్‌లెట్ల తగ్గుదల ప్రమాదం పొంచి ఉంది. జ్వరం ప్రారంభమయ్యే విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. వైద్య సంరక్షణను పొందాలి. అన్నింటికంటే ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండాలి." అని తెలిపారు.
డెంగ్యూ కేసుల సంఖ్య తక్కువే:
ఈ ఏడాది డెంగ్యూ కేసులు తక్కువగా నమోదవుతున్నాయని తెలంగాణలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ రావు మాట్లాడుతూ “వైద్యులు, ప్రజలలో పెరిగిన అవగాహన, ముందస్తుగా గుర్తించడం. ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన నివారణ చర్యలు డెంగ్యూ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవ్వడానికి కారణం అవుతున్నాయి. హైడ్రేషన్ పద్ధతులు, సకాలంలో రోగలక్షణాలకు చికిత్స అందించడం చాలా కీలకం." అని అన్నారు.
దోమల నియంత్రణ, అంటు వ్యాధుల నివారణపై ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగాయి.
డెంగ్యూ, చికున్‌గున్యాను తగ్గించడంలో ప్రజల్లో మంచి అవగాహన:
తెలంగాణ వ్యాప్తంగా దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు ముమ్మరం చేశాయి. దోమల వృద్ధిని నివారించడానికి ఇళ్ల చుట్టూ నిలిచిన నీటిని తొలగించాల్సిన అవసరాన్ని TSHA బలంగా ప్రచారం చేసింది. “నివారణ చర్యలు ఇంటి నుంచే మొదలవుతాయి. డెంగ్యూ, చికున్‌గున్యా రెండింటి ప్రమాదాన్ని తగ్గించడానికి నీటి పాత్రలను ఖాళీ చేయడం, కాలువలను శుభ్రపరచడం, దోమల వ్యాప్తి జరగకుండా చేయాలి” అని డాక్టర్ రావు సూచించారు. పారాసెటమాల్‌తో రోగలక్షణాలకు చికిత్స అందించవచ్చు. రోగ లక్షణాలను గుర్తించడమే కాకుండా, యాంటీబయాటిక్‌లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండాలని TSHA పౌరులను కోరింది.
భయపడాల్సిన అవసరం లేదు: సిద్ధంగా ఉన్న ప్రభుత్వం
కేసులు పెరుగుతున్నప్పటికీ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని TSHA హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రెండూ డెంగ్యూ కేసులకు చికిత్స అందించడానికి తగిన మౌలిక సదుపాయాలు, వనరులతో సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు ICU లో సంరక్షణ అవసరం అవుతుంది. "డెంగ్యూ రోగులలో హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH) వంటి సమస్యలు తలెత్తే అరుదైన సందర్భాల్లో, స్టెరాయిడ్స్ లేదా IV ఇమ్యునోగ్లోబులిన్ వంటి చికిత్సలు అవసరం కావచ్చు" అని డాక్టర్ హరి చెప్పారు. అసోసియేషన్, ఆరోగ్య నిపుణులు ఎవరికైనా జ్వరం, కీళ్ల నొప్పులు లేదా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, వైద్యులను ముందస్తుగా సంప్రదించాలని సూచించారు.
పెరుగుతున్న కేసులపై:
రాష్ట్రంలో ప్రస్తుతం డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా తదితర వ్యాధులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల సమీక్షా సమావేశంలో చర్చించారు. దోమల నివారణ కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, తెలంగాణలో మొత్తం 6,242 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి, 1 లక్షకు పైగా నమూనాలను పరీక్షించగా 6 శాతం పాజిటివ్ రేటు ఉంది. రాష్ట్రంలోని మొదటి 10 హైరిస్క్ జిల్లాలలో హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మరియు వరంగల్ ఉన్నాయి. ఇక్కడ అధికారులు వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి ప్రయత్నాలను చేస్తున్నారు.
అప్రమత్తత, నివారణ:
డెంగ్యూ, చికున్‌గున్యా కేసులను తగ్గించడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సరైన చర్యలు తీసుకోవాలి. సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తుగా రోగ నిర్ధారణ, సరైన చికిత్స, ప్రజల అవగాహనపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.