హుజూరాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 290, 353, 506 కింద కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఓట్ల లెక్కింపు వేళ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పోలీసులు అంటున్నారు.
ఇక పోలింగ్ కు ముందు తనను గెలిపించకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఎన్నికల్లో గెలుపొందారు. ఇక తన పాత ఫోటోలు పెట్టి రేవంత్ రెడ్డిని కలిసినట్లు దుష్రచారం చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్, కేసీఆర్ వెంటే ఉంటానని.. ఫేక్ వీడియోలు, ఫోటోలు నమ్మవద్దని తెలిపారు. హుజూరాబాద్ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి.. ప్రజల మెప్పును పొందుతానన్నారు.