చిక్కుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు.

By Medi Samrat  Published on  13 Dec 2023 10:29 AM GMT
చిక్కుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై భూకబ్జా కేసు నమోదయింది. తమ భూమిని ఆక్రమించారంటూ గిరిజనులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవపురంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తూ శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో భిక్షపతి అనే వ్యక్తితో కలిసి పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాఫ్తు జరుపుతున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్ పై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు.

మల్లారెడ్డి బినామీ అనుచరులు తొమ్మిది మంది అక్రమంగా కబ్జా చేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. కుట్రతో మోసగించి భూమిని కాజేసారని బాధితులు శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. బాధితుడు కేతా వత్ బిక్షపతి నాయక్ మాట్లాడుతూ... ఈ భూమి మా అమ్మ రాజీ పేరు మీద మేడ్చల్ మల్కాజిరి జిల్లాలోని మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోనిదని.. వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు. ఈ భూమిపై స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. మల్లారెడ్డి అనుచరులు 250 కోట్ల విలువ చేసే భూమిని లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Next Story