ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడమే కాదు.. పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నిర్వహిస్తామని తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నాయకుల విమర్శల సరికాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. "పొలిటికల్‌గా నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది.. వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని నేను" అని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ.. అది సీక్రెట్ అని.. ఇప్పుడే ఏం చెప్పలేమని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
కాగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రసుత్తం కేబినెట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి కేబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ముఖ్యమైన హోం, విద్యాశాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపించేవి.