తోడుగా నిలబడుతా, పోరాటం కొనసాగిద్దాం..కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు తోడుగా తాను నిలబడుతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik
తోడుగా నిలబడుతా, పోరాటం కొనసాగిద్దాం..కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు తోడుగా తాను నిలబడుతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడేందుకు నిస్వార్థంగా, ఉదాత్తమైన లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని, పర్యావరణం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వం విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తున్నా, నిస్వార్థమైన విద్యార్థి-ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులు చేసిన పోరాటానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం దీనికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ దళారి మాదిరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసం, బెదిరింపు ధోరణిలో ఏకో పార్క్ ఏర్పాటు అంటూ, ఫోర్త్ సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ తరలింపు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడి వరకూ పక్కా కుట్రతో మాట్లాడుతున్న మాటలను కేటీఆర్ తన లేఖలో ఎండగట్టారు. 50 సంవత్సరాలకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ ప్రాపగండ చేస్తున్న ఏకో పార్క్ కన్నా గొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిన క్యాంపస్‌గా నిలిచిందని కేటీఆర్ తెలిపారు.
విద్యార్థుల పోరాటం ఫలించి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన పర్యావరణ హత్యను అడ్డుకున్నదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల నేపథ్యంలో ఈ పోరాటం పూర్తిగా అయిపోలేదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలి ఉందని, ప్రభుత్వ కుట్రలను, బెదిరింపులను, దుష్ప్రచారాన్ని దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలియజేశారు. ఈ పోరాటానికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే మా పార్టీ తరఫున 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా బి ఆర్ ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణం కోసం 400 ఎకరాలను వేలం వేసే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటున్నట్లు వెంటనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.