కేంద్ర బడ్జెట్‌లో.. తెలంగాణకు మరొకసారి దక్కింది గుండు సున్నానే: కేటీఆర్
కేంద్ర బడ్జెట్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి గుండు సున్నానే దక్కిందన్నారు.
By అంజి Published on 23 July 2024 11:45 AM GMTకేంద్ర బడ్జెట్‌లో.. తెలంగాణకు మరొకసారి దక్కింది గుండు సున్నానే: కేటీఆర్
కేంద్ర బడ్జెట్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యమని కేటీఆర్ అన్నారు. రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని, బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి గుండు సున్నానే దక్కిందన్నారు.
''ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఐఐఎం సహా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ముంబై-నాగపూర్, బెంగళూరు-చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు'' అని కేటీఆర్ అన్నారు.
''మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినప్పటికీ కేంద్రం స్పందించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.'' అని కేటీఆర్ కోరారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ''ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోంది. పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు'' అని అన్నారు.
''ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు. రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి ద్వేషం లేదు, సంతోషమే. కానీ ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోకపోవడం'' బాధకరమని కేటీఆర్ అన్నారు.