చంచల్‌గూడ జైలుకు పంపే శ్రద్ధ..దానిపై కూడా పెట్టండి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 10 April 2025 9:52 AM IST

Telangana, Congress Government, Brs Working President Ktr, Cm Revanthreddy

చంచల్‌గూడ జైలుకు పంపే శ్రద్ధ..దానిపై కూడా పెట్టండి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని.. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఫలక్ నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చంచల్ గూడ జైలుకు పంపే శ్రద్ధ దాని ముందున్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడంపై లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెనదీ అదే దుస్థితి అన్నారు.

అంతేకాదు.. శాస్త్రీపురం ఆర్వోబీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని.. పూర్తయిన వాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగులు చేశారని విమర్శించారు. నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమేనా? అని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ నిర్మాణాల మీద లేదా? అని అడిగారు. అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం, బుల్డోజర్‌లను ఉసిగొల్పడం కాదని హితవు పలికారు. చివరలో ‘జాగో తెలంగాణ జాగో’ అంటూ ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు ప్రతిపాదించిన స్టీల్ వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 25- కి.మీల మేర నాలుగు లేన్లుగా రూ.523.37 కోట్లతో 2020లో పనులకు శంకుస్థాపన చేయగా, ఐదేళ్లలో 53 శాతం మేర మాత్రమే పనులు జరిగాయి. దీంతో కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Next Story