ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చ‌రిక‌

మూసీ నది పరీవాహక ప్రాంత నివాసితులకు భరోసా కల్పించేందుకు వెళుతున్న‌ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముషీరాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి

By Medi Samrat  Published on  1 Oct 2024 2:38 PM IST
ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చ‌రిక‌

మూసీ నది పరీవాహక ప్రాంత నివాసితులకు భరోసా కల్పించేందుకు వెళుతున్న‌ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముషీరాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ కేటీఆర్ అంటూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పరిశీలించేందుకు, బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ ఘాట్ కు బయల్దేరారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నాయి. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపైకి కూడా ఎక్కారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. నా ప్రజలకు అండగా నిలబడడాన్ని నువ్వు ఆపలేవని సీఎంను హెచ్చరించారు. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడిని కాదు రేవంత్‌ రెడ్డి.. మీ తాట తియ్యడానికి వచ్చానని పేర్కొన్నారు. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ.. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో అని హెచ్చరిక జారీ చేశారు. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు.. నీ గుండా రాజ్యాన్ని.. నియంతృత్వ పాలనను సవాలు చేసే.. నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరని కేటీఆర్ అన్నారు. నీ గుండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుందన్నారు. ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు అని అన్నారు.

Next Story