మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దాం.. నువ్వోనేనో తేల్చుకుందాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్‌ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 Feb 2024 11:12 AM GMT
brs,  ktr, challenge,  cm revanth reddy, telangana,

మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దాం.. నువ్వోనేనో తేల్చుకుందాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్‌ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్‌ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలనీ.. త్వరలోనే కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాక.. కరెంటు, రైతుబంధు సహా ఇతర విషయాల్లో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

రేవంత్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పార. ఇక త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో బరిలో దిగుదామని సవాల్ విసిరారు. ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి స్థానం సిట్టింగ్ సీటు అని.. అతనికి బలం ఉన్న చోటే పోటీ పడదామన్నారు కేటీఆర్. సేఫ్‌ గేమ్‌ వద్దు.. డైరెక్ట్‌గా ఫైట్‌ చేద్దామంటూ చాలెంజ్‌ చేశారు.

ఈ మేరకు మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గతంలోనూ రేవంత్‌ సవాల్‌ చేసి పారిపోయారని చెప్పారు. కొడంగల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సవాల్‌ చేసిన రేవంత్‌ పారిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. సవాల్‌ చేయడం.. ఆ తర్వాత పారిపోవడం.. ఇలా చేస్తున్న ఆయన మాటకు విలువేముందని ప్రశ్నించారు. తనది మేనేజ్‌మెంట్‌ కోటా అయితే రాహుల్, ప్రియాంకగాంధీలది ఏ కోటా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇక రేవంత్‌ది మాత్రం పేమెంట్‌ కోటా అనీ.. డబ్బులిచ్చి మరీ పదవిని తెచ్చుకున్నారంటూ బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Next Story