సర్కారు కాదు, సర్కస్ కంపెనీ..సుప్రీం ఆదేశాలతో కాంగ్రెస్‌కు దిమ్మదిరిగింది: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు

By Knakam Karthik
Published on : 4 April 2025 10:35 AM IST

Telangana, Congress Government, Ktr, Cm Revanth, Supreme Court, HCU Land Issue

సర్కారు కాదు, సర్కస్ కంపెనీ..సుప్రీం ఆదేశాలతో కాంగ్రెస్‌కు దిమ్మదిరిగింది: కేటీఆర్

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్‌గా ప్రకటించి నగరంలోనే బెస్ట్ ఎకో పార్క్‌గా తయారు హెచ్‌సీయూకి కానుకగా ఇస్తామని ప్రకటించిన వెంటనే.. 24 గంటలు తిరగక ముందే 2 వేల ఎకరాల్లో ఎకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కారు బీరాలు పలుకుతోందని అన్నారు. సుప్రీం ఆదేశాలతో సర్కారుకు దిమ్మతిరిగిందని.. ఎకో పార్క్ నిర్మాణం అంటే ఏఐ వీడియో తయారు చేసినంత ఈజీ కాదన్నారు. ఇక నైట్ సఫారీ అంటే.. రాత్రికి రాత్రే వందల జేసీబీలు, టిప్పర్లతో చొరబడి విధ్వంసం చేయడం కాదని సెటైర్లు వేశారు.

నాలుగు రోజుల్లో వందల ఎకరాల అడవిని నాశనం చేసి.. ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించి, కేసులు పెట్టి జైళ్ల పాలు చేశారని మండిపడ్డారు. మూగ జీవుల ఆర్తనాదాలు, అర్ధరాత్రి దండయాత్రను కెమెరాలతో చిత్రీకరించారని కేసులు పెట్టి, ఏఐ వీడియోలు అంటూ దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. పెయిడ్ ఉద్యమకారులు అని గోబెల్స్ ప్రచారం చేసి.. చివరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించి అభాసుపాలైంది అనైతిక కాంగ్రెస్ సర్కార్ అంటూ మండిపడ్డారు. ఇది ఇది సర్కారు కాదు.. సర్కస్ కంపెనీ అంటూ ఫైర్ అయ్యారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ఆకాంక్షల హేళన.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

అయితే కంచ గ‌చ్చిబౌలి పరిధిలోని మొత్తం 400 ఎక‌రాల భూ వ్యవహారంలో గురువారం సుప్రీం కోర్టు సీరియస్ అయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి ఆదేశించింది. మరో వైపు భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ సెంట్రల్​ యూనివర్సిటీ(HCU) విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది.

Next Story