ప్రధాని మోదీ తాను బీసీనని చెప్పుకుంటూనే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ పదేళ్ల నుంచి అత్యున్నత పదవిలో ఉన్నా కూడా కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదన్నారు. కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మోదీ పదేళ్లుగా తొక్కి పెట్టారన్నారు.
కులగణన చేపట్టాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నా మోదీ పట్టించుకోవడం లేదన్నారు. కులగణన, బీసీ, మహిళా రిజర్వేషన్స్ అమలు జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నామ నాగేశ్వరరావు వంటి బలమైన నాయకుడు పార్లమెంటులో ఉంటేనే ప్రజల న్యాయమైన హక్కులకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని కార్యకర్తలతో అన్నారు.