పార్టీ 25 ఏళ్ల సభకు అనుమతి నిరాకరణ..హైకోర్టులో బీఆర్ఎస్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్‌లో కోరారు.

By Knakam Karthik
Published on : 11 April 2025 3:15 PM IST

Telangana, Brs, TG High Court, Congress Government

పార్టీ 25 ఏళ్ల సభకు అనుమతి నిరాకరణ..హైకోర్టులో బీఆర్ఎస్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అయితే పోలీసులు ఆ సభకు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్‌లో కోరారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఏప్రిల్ 17వ తేదీలోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. బీఆర్ఎస్ సభ అనుమతిపై పరిశీలిస్తున్నామని, వారం రోజుల్లో అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ఈ నెల 17లోపే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ పోలీస్ కమిషనర్, కాజీపేట ఏసీపీలను బీఆర్ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరఫున ఈ నెల 21వ తేదీ వరకు సమయం కోరారు. అయితే, సభకు ఏర్పాట్లు చేసుకోవలసి ఉన్నందున ఈ నెల 17వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Next Story