రూ.4,000 పింఛ‌న్ ఎప్పటి నుంచి ఇస్తారు.? మహిళలకు ఇస్తామ‌న్న‌ రూ 2,500 హామీ ఏమైంది.?

మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు.

By Medi Samrat  Published on  28 Feb 2024 11:53 AM GMT
రూ.4,000 పింఛ‌న్ ఎప్పటి నుంచి ఇస్తారు.? మహిళలకు ఇస్తామ‌న్న‌ రూ 2,500 హామీ ఏమైంది.?

మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉంది.. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వున్నాయని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్ర‌శ్నించారు. మహాలక్ష్మి పథ‌కం కిందనే మూడు హామీలు ఉన్నాయన్నారు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల హామీ ఏమైందన్నారు.

500 రూపాయల గ్యాస్ సబ్సిడీ 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది అంటున్నారు. మొత్తం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు వున్నాయన్నారు. గ్యాస్ కనెక్షన్లు కేవలం మహిళల పేరు మీద ఉంటేనే సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్నా సబ్సిడీ వర్తింప చేయాలన్నారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు మొత్తం కట్టించుకుని సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తామని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ పథకంగా మారిందన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు వున్నాయన్నారు.

రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. మహిళలకు సరిపడా బస్సులను ప్రభుత్వం నడపాలన్నారు. ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైందని ప్ర‌శ్నించారు. పింఛన్లు 4,000 ఎప్పటి నుండి అమలు చేస్తారని ప్ర‌శ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్దమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు ఓట్లు వేశారు. గుడ్డిగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు వందల కొర్రీలు పెడుతున్నారని విమ‌ర్శించారు.

రేవంత్ రెడ్డి పరుష పదజాలం మానుకోవాలని సూచించారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే రేవంత్ రెడ్డి ఎజెండా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీటును టచ్ చేసే వాళ్ళు పక్కనే ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో వున్నారని.. తాను జైలుకు వెళ్లానని అందరినీ జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని అన్నారు.

దళితులు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది 100 యూనిట్లేనా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన ఉద్యోగ నియామక పత్రాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన‌వి పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చాక ప్రతి జిల్లాకు కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఇచ్చారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. రాష్ట్రంలో కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారు. రైతులకు ఇస్తామన్న బోనస్ ఏమైందని ప్ర‌శ్నించారు.

మేడిగడ్డను రిపేర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎల్.ఆర్.ఎస్. ఉచితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.

Next Story