గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik
గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయి. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం ఆక్షేపనీయం. గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం ఏర్పడింది. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. ఈ పది మంది అభ్యర్థల సంఖ్య ఎలా పెరిగింది...అని ఎమ్మెల్సీ కవిత తాను రాసిన లేఖలో తెలిపారు.
బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి? సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారా? లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొంది. జవాబు పత్రాల మూల్యాంకనం పైనా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్ చేయిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమానాలున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ను పెంచింది. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరై రెండు కోచింగ్ సెంటర్లను చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి..అని ఎమ్మెల్సీ కవిత లేఖలో తెలియజేశారు.