బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం..అని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన బీసీ ధర్నాకు హాజరైన తలసాని మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన లెక్క తప్పుల తడక. హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు. 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం కేంద్రంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం లేదు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటుంది..బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారు? 9వ షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంట్‌లో ఆమోదిస్తేనే చట్టబద్ధత వస్తుంది. 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరపాలి. మేం యాచకులం కాదు.. 42 శాతం మా హక్కు. రిజర్వేషన్లు అమలు చేయకుంటే మీ అధికారాన్ని లాక్కుంటాం..అని తలసాని వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై గతంలో పలువురు ముఖ్యమంత్రులు తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై అప్పుడే అంతా అయిపోయినట్లుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సన్మానం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.